సూపర్‌స్టార్ కృష్ణ 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో కృష్ణకు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. అయితే నిజానికి ఆయనకు మొదట హీరోగా ఆఫర్ వచ్చింది ఓ తమిళ సినిమాకు. అయితే ఆయనకు తమిళం రాకపోవడంతో ఆ ఛాన్స్ చేజారింది. లేనట్లయితే ఆయన తమిళ సినిమాతో హీరోగా పరిచయం అయ్యుండేవారు.
తమిళ దర్శకుడు శ్రీధర్ ఓసారి చెన్నై పాండీ బజార్‌లోని భారత్ కేఫ్ ముందు నిల్చొని ఉన్న కృష్ణను చూసి, 'చాలా బాగున్నాడు, నా సినిమాలో హీరోగా పనికొస్తాడ'ని భావించారు. ఆయనను దగ్గరకు పిలిచి, "సినిమాల్లో నటిస్తావా?" అనడిగితే నటిస్తానని చెప్పారు కృష్ణ. "రేపు మా ఆఫీసుకు వచ్చి కలుసుకో" అని ఆ ఆఫీసు పేరు, అదెక్కడ ఉంటుందో చెప్పి వెళ్లారు.
అప్పుడు శ్రీధర్ 'కాదలిక్క నేరమిల్లై' (1964) అనే తమిళ చిత్రాన్ని అంతా కొత్తవాళ్లతో తీద్దామని సన్నాహాలు చేస్తున్నారు. మర్నాడు చిత్రాలయ బ్యానర్ ఆఫీసుకు వెళ్లారు కృష్ణ. ఆయనకు తన సినిమాలో హీరో వేషం ఇవ్వదలచుకున్నట్లు చెప్పారు శ్రీధర్. కృష్ణకు ఆనందం వేసింది. అయితే తనకు తమిళం రాదని చెప్పారు. దాంతో ఆయన కోసం ఓ తమిళ ట్యూటర్‌ను అరేంజ్ చేశారు శ్రీధర్. అయితే వారం రోజులు గడిచినా కృష్ణకు తమిళం ఏమాత్రం వంటపట్టలేదు. ఎందుకంటే ఆయన దృష్టంతా తెలుగు సినిమాల మీదే ఉంది మరి.
దీంతో ఉపయోగం లేదనుకున్న శ్రీధర్.. హీరో వేషానికి మరో కొత్త నటుడు రవిచంద్రన్‌ను ఎంపికచేశారు. అలా ఆ సినిమా కృష్ణకు తప్పిపోయింది. లేకపోతే 'తేనె మనసులు' (1965) కంటే ముందే ఆ సినిమాతో ఆయన పరిచయం అయ్యుండేవాడు. అప్పుడు 'తేనె మనసులు' సినిమా మిస్సయిపోయేదేమో. విశేషమేమంటే శ్రీధర్ తీసిన 'కాదలిక్క నేరమిల్లై' సినిమా తెలుగులో రీమేక్ అయ్యింది. అది అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'ప్రేమించి చూడు'.
ఈ ఉదంతం జరిగిన పదహారు సంవత్సరాలకు శ్రీధర్ డైరెక్షన్‌లో తొలిసారి నటించారు కృష్ణ. ఆ సినిమా.. ఎక్కువగా అమెరికాలో షూటింగ్ జరుపుకున్న 'హరే కృష్ణ హలో రాధ' (1980).